Monday, November 25, 2024

TS : కాంగ్రెస్ వచ్చింది… కరువొచ్చింది… మాజీమంత్రి హ‌రీష్‌రావు….

సంగారెడ్డి, ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్): కాంగ్రెస్ వంద‌రోజుల పాల‌న‌లో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఆఖరికి రైతులకు కన్నీళ్లే మిగిలాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావు మండిప‌డ్డారు. ఇవాళ సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారనీ. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల పరిహారం చెల్లించాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మానాలని అన్నారు. మామీద విమర్శలు చేయండి, తిట్టండి. కానీ రైతుల గురించి ఆలోచించండి, వాళ్ళను ఆదుకోండి. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండని సూచించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతుల రూ.15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని ఆయన విమర్శించారు.

- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేని, కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారన్నారు. . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చిందని ఎద్దెవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తార‌న్నారు. మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదని, రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుందని రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్ద‌ని, మీకు అండగా మేముంటామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement