Tuesday, November 26, 2024

కాంగ్రెస్ అభ్య‌ర్ధుల భ‌విత‌వ్యం సీల్డ్ క‌వ‌ర్ లో…. తొలి జాబితాలో 35 మందికి టికెట్స్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ తరుపున నిలబెట్టే అభ్యర్థుల జాబితా ఖరారుపై కాంగ్రెస్‌ పార్టీ జరుపుతున్న ప్రక్రియను వేగవంతం చేసింది . రాష్ట్రంలోని 119 అసెంబ్లిd నియోజకవర్గాలలో పోటీకి 1220 మంది నేతలు దరఖాస్తు చేసుకోగా ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి సంబంధిత జాబితాను సీల్డ్‌ కవర్‌లో ఉంచింది. నేటి ఉదయం స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ కమిటీలో పార్టీ అధినాయకత్వం ఎంపిక చేసిన కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌, సభ్యులు జీ.గణష్‌ మేవాని, సిద్దిఖీలు సమావేశమవుతారు. ఆదివారం నిర్వహించిన కసరత్తుకు సంబంధించిన అంశాలను పీఈసీ సభ్యులు స్క్రీనింగ్‌ కమిటీకి వివరించి సీల్డ్‌ కవర్‌ను అందజేస్తారు. ఆశావహుల జాబితాను నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు, అంతకన్నా ఎక్కువ వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎన్నికల కమిటీ అందులో బలమైన వారిని ఎంపిక చేసి వారి పేర్ల చివర టిక్‌ మార్కును పెట్టినట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి ఆ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ ముందుంచనున్నారు. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తును పూర్తి చేసిన నేతలు నియోజకవర్గాల వారీగా ఆశావహుల ప్రాధాన్యతా సంఖ్యలను కేటాయించారు. బాగా బలంగా ఉండి విపక్ష పార్టీల అభ్యర్థులకు ధీటైన వారికి క్రమ సంఖ్య 1ని కేటాయించారు. ఇలా 2, 3 క్రమ సంఖ్యలను నేతల పేర్ల చివర పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో పోటీ కోసం ఎన్నికల కమిటీలోని సభ్యులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. తమకే తుది ప్రాధాన్యతా సంఖ్య కేటాయించాలని కొందరు ఈ సమావేశంలో కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యతా సంఖ్య కోసం నేతలు కమిటీలోని మిగతా సభ్యుల మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ కన్నా బీసీలకు కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు…
భారత రాష్ట్ర సమితి వెనుకబడిన తరగతులకు ఇచ్చిన సీట్ల కన్నా తమ పార్టీలో ఎక్కువ సీట్లను ఈ వర్గాలకు కేటాయిస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చెప్పారు. సమావేశం ముగిశాక ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన జాబితాను సీల్డ్‌ కవర్‌లో సోమవారం స్క్రీనింగ్‌ కమిటీకి అందజేస్తామని ఆయన చెప్పారు. మూడు రోజులపాటు స్క్రీనింగ్‌ కమిటీ హైదరాబాద్‌లోనే మకాం వేసి టికెట్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తుందని చెప్పారు. సోమవారం స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీకి చెందిన ముఖ్యులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటుందని చెప్పారు.

6న ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ కమిటీ
సోమవారం నుంచి రెండు రోజులపాటు వరుస సమావేశాలను నిర్వహించి ఆయా నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు 6వ తేదీన ప్రత్యేకంగా సమావేశమై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఇచ్చిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఈ కమిటీ తుది జాబితాను రూపొందించి ఢిల్లిdలోని కేంద్ర ఎలక్షన్‌ కమిటీకి నివేదిస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసి పార్టీ ముఖ్యులకు ఈ నివేదిక ఇస్తుందని ఆ తర్వాత తొలి జాబితా ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే అభ్యర్థుల జాబితానే ఫైనల్‌ అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. పీసీసీ అధ్యక్షుడినైన తనకు కూడా అభ్యర్థులు ఎవరన్న సమాచారం ఉండదని, అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. స్థానిక పరిస్థితులు, సామాజికవర్గాలను పరిగణనలోనికి తీసుకుని బీసీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. బీసీలకు సంబంధించిన సీట్ల కేటాయింపులో ఎవరికీ ఎటువంటి అపోహలు, అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని రేవంత్‌ వివరించారు.

ఈ నేత‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్…

కొడంగల్‌-రేవంత్‌ రెడ్డి, సంగారెడ్డి- జగ్గారెడ్డి, కామారెడ్డి- షబ్బీర్‌ అలీ, భద్రాచలం-పోడెం వీరయ్య, నాగార్జున సాగర్‌- కుందూరు జయవీర్‌ రెడ్డి, నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆలంపూర్‌- సంపత్‌ కుమార్‌, మంచిర్యాల- ప్రేమ్‌ సాగర్‌ రావు, ఆంథోల్‌-దామోదర రాజనర్సింహ, పరిగి-రామ్మోహన్‌ రెడ్డి, వికారాబాద్‌-గడ్డం ప్రసాద్‌, ఇబ్రహీంపట్టణం-మల్‌రెడ్డి రంగారెడ్డి, ఆలేరు-బీర్ల అయిలయ్య, దేవరకొండ-వడ్త్య రమేష్‌ నాయక్‌, వేములవాడ-ఆది శ్రీనివాస్‌, ధర్మపురి-లక్ష్మణ్‌, పరకాల- ఇనగాల వెంకట్రామిరెడ్డి, హుజూర్‌ నగర్‌-ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ-పద్మావతి, మధిర-మల్లు భట్టివిక్రమార్క, మంథని-శ్రీధర్‌ బాబు, జగిత్యాల-జీవన్‌ రెడ్డి, ములుగు- సీతక్క, హుజూరాబాద్‌-బల్మూరి వెంకట్‌, వేములవాడ- ఆది శ్రీనివాస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement