హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుఫాన్ రాబోతుందని, తాము అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమాను వ్యక్తం చేశారు. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ . టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ,
తెలంగాణలో తమది రక్త సంబంధమన్నారు. తాము తెలంగాణ ప్రజలతో రాజకీయ బంధం కోరుకోవడం లేదన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, తాను, తన సోదరి ప్రియాంక గాంధీలు తెలంగాణ ప్రజలతో ఆత్మీయ బంధాన్ని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనని ఆయన చెప్పారు. ప్రియాంక గాంధీ, నేను ఢిల్లీలో మీ కోసం సైనికులుగా పనిచేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను రాహుల్ గాంధీ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఈ ఆరు గ్యారంటీల అమలుకు తీర్మానం చేయనున్నట్టుగా రాహుల్ గాంధీ వివరించారు.
భారత్ జోడోయాత్రలో తాను ఒక్కటే చెప్పానన్నారు. విద్వేష దేశం మనకు అవసరం లేదని చెప్పానన్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని ఆయన గుర్తు చేశారు. తనపై మోడీ సర్కార్ 24 కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. తన ఎంపీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారన్నారు. అంతేకాదు తన ఇల్లును కూడ లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. కోట్లాది మంది హృదయాల్లో నా ఇల్లు ఉందని చెప్పారు. కేసీఆర్ కు అవసరమైనప్పుడు కేంద్రం సహకరిస్తుందని ఆయన విమర్శించారు. మోడీ సర్కార్ కు బీఆర్ఎస్ సహకరిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.