కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విదిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. రెండూ ఒకే గూటి పక్షులని, పరస్పరం సహకరించుకుంటున్నాయని అన్నారు. అమిత్ ఫేక్ వీడియోపై కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ను కాంగ్రెస్ పార్టీ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో, ఈ పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలందరూ చూశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట పంచ సూత్రాలతో పాలన చేస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి, అబద్ధాలు, మాఫియా, కుటుంబపాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందని ఆరోపించారు. దేశంలో మళ్లీ పాతరోజులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విధిస్తుందని అన్నారు.
‘కాంగ్రెస్ తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ తెచ్చింది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు దొంగదారిలో డబుల్ ట్యాక్స్ కడుతున్నారు. డబుల్ ఆర్ అంటే ఎవరో మీకు అర్థమై ఉంటుంది. డబుల్ ఆర్ ట్యాక్స్ తో బ్లాక్ మనీ ఢిల్లీకి చేరుతోంది. డబుల్ ఆర్ ట్యాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ నేతలతో పాటు.. ఢిల్లీలో కాంగ్రెస్ మిత్రపక్ష నేతలున్నారు.
వంద రోజుల్లో రుణమాఫీ అని కాంగ్రెస్ మోసం చేసింది. క్వింటాల్ కు రూ.500 బోనస్ అని బోగస్ మాటలు చెప్పారు. బీజేపీ వల్లే మహిళలకు రక్షణ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంపదకు రక్షణ. అయోధ్యలో రామమందిర నిర్మాణం.. 500 ఏళ్లుగా భారతీయుల స్వప్నం. మీ ఓటు వల్లే రామామందిర నిర్మాణ సాధ్యమైంది. హైదరాబాద్ లో పండుగు జరుపుకోవాలంటే ఎన్నో ఆంక్షలున్నాయి. ఓ వర్గం ఓట్ల కోసమే హైదరాబాద్ లో.. ఆంక్షలు విధించారు’ అంటూ మోదీ విమర్శలు చేశారు.