తెలంగాణకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పటాన్ చెరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రక్కన ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జిహెచ్ఎంసి వార్డు కార్యాలయ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంక్ భవనాన్ని ప్రారంభించారు.
పట్టణ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ భవనాన్ని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జీఎంఆర్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు ఉన్నాయా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రిజెక్టెడ్ లీడర్లు, స్క్రాప్ లీడర్లు జాయిన్ అయితే పోయేది లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ మాత్రమేనని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం తథ్యమన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు పాల్గొన్నారు.