Friday, November 22, 2024

Congrats – పివికి భార‌త ర‌త్న …కెసిఆర్ తో సహా పలువురు నేతలు హ‌ర్షం..

హైద‌రాబాద్ – తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారత రత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్‌ను గౌరవించి పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు: బండి సంయ్
తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సంజయ్ కుమార్ వర్ణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడంతో ఆ జిల్లా వాసిగా గర్వపడుతున్నానని అన్నారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరిస్తే.. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్దికి వాడుకుందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారం ప్రకటించడం సముచిత నిర్ణయమని పేర్కొన్నారు.

దేశ ప్రజలందరికీ గర్వకారణం: కిషన్ రెడ్డి
ప్రముఖ జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతదేశ అత్యున్నత పౌరపురస్కారం భారత రత్నకు ఎంపికవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దేశం కోసం, దేశాభివృద్ధి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి హోదాలో.. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ పురోగతికి పీవీ పునాదులు వేశారని ప్రశంసించారు.

తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం: డీకే అరుణ
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రకటించడం సంతోషదాయకమని, ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. విశిష్ట పండితుడు, బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడిగా.. నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని కొనియాడారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్టం చేయడంలో పీవీ నరసింహా రావు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.

ప్ర‌ధానికి ధ్యాంక్స్ … కెటిఆర్..
‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం హర్షించదగ్గ విషయం. నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన పీవీ శతజయంతి వేడుకల్లో భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం.’ అన్నారు. దీనికి గతంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ ట్యాగ్ చేశారు.

- Advertisement -

తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవం ఇది – -మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
దివంగత మాజీ ప్రధాని బాహుభాషా వేత్త, ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అన్నింటికీ మించి తెలంగాణా బిడ్డ పి వి నరసింహ రావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించడాన్ని మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్వాగతించారు.ఇది తెలంగాణా ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement