సూర్యాపేట, ప్రభ న్యూస్ : సూర్యాపేటలోని ఇమామ్ పేట సాంఘిక సంక్షేమ శాఖ (ఎస్‌సీ) గురుకుల పాఠశాల వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం పాఠశాల ఆవరణలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన 5 నుంచి 9వ తరగతి సీట్ల భర్తీ కోసం స్పాట్ ప్రక్రియ గందరగోళం నెల్కొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. యజమాన్యం కూడా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొందని వారు ఆరోపించారు.
ఉదయం నుంచి పడిగాపులు
ఉదయం రెండు సీట్లు ఉన్నాయని, ఆ తర్వాత 45 సీట్లు, ఆ తరువాత 99 సీట్లు ఉన్నాయని పాఠశాల యజమాన్యం విడతల వారీగా ప్రకటించిందన్నారు. స్పాట్ అడ్మిషన్లకు సుమారు మూడు వేల మంది హాజరయ్యారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పడిగాపులు కాశామని స్పష్టంగా ప్రకటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైరవీలు చేసే వారికి సీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫార్సులు ఉన్నాయా? అని అడుగుతుండడంపై వారు మండిపడ్డారు.