గోదావరి ఖని లేబర్ కోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, జన్నారం (మంచిర్యాల జిల్లా) : గోదావరిఖని లేబర్ కోర్టు ఆదేశాల మేరకు జన్నారం అటవీశాఖ డివిజనల్ కార్యాలయం ఆస్తులను శుక్రవారం ఉదయం జప్తు చేశారు. లక్షేటిపేట ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సిబ్బంది గోలి సాయికుమార్, ఇతర ఉద్యోగులు ఇక్కడికి వచ్చి కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లను, కుర్చీలను, టేబుల్స్ ను, ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఈ విషయమై మంచిర్యాల స్థానిక ఇన్చార్జి ఎఫ్డీఓ శివ్ ఆశీష్ సింగ్ వద్ద ప్రస్తావించగా కోర్టు ఆదేశాల మేరకు తమ కార్యాలయ ఆస్తులను జప్తు చేశారన్నారు. తాము హైకోర్టులో అప్పీలుకు వెళ్లామని ఆయన చెప్పారు.
కార్మికుడి వేతనం చెల్లించకపోవడంతో…
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దోస్తునగర్ కు చెందిన బియ్యాల లింగన్న గత 30 ఏళ్లుగా అటవీశాఖలో దినసరి కార్మికుడిగా పనిచేశారు. 2016లో లింగన్నను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆయన పెద్దపెల్లి జిల్లాలోని గోదావరిఖని లేబర్ కోర్టులో కేసు వేశారు.
ఆ కోర్టు న్యాయమూర్తి 2024 జూన్ 18 లింగన్నను ఉద్యోగంలో చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగంలో చేర్చుకోకపోగా జీతం కూడా ఇవ్వకపోవడంతో అదే కోర్టును ఆయన ఆశ్రయించారు. దీంతో బకాయి జీతం రూ.ఒక్క లక్ష చెల్లించనందుకు కోర్టు ధిక్కరణలో భాగంగా స్థానిక కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేయాల్సిందిగా ఆదేశించారు.