హైదరాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పరిగి ప్రాంతానికి ఆయన ఎన్నో సేవలు అందించారన్నారు. ఆయన ఆత్మకు శాతి కలగాలని ప్రార్థించారు. హరీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. పరిగి ఎమ్మెల్యేగా, ఉప సభాపతిగా, సీనియర్ రాజకీయ నేతగా గొప్ప సేవలు అందించారని చెప్పారు. ఆయన కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన మరణం బీఆర్‌ఎస్ పార్టీకి, జిల్లాకు తీరన లోటన్నారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నారు. హరీశ్వర్ రెడ్డి మృతదేహానికి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నివాళులర్పించారు.
శనివారం ఉదయం వికారాబాద్‌లోనని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి మహేందర్ రెడ్డి ఆయన భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. హరీశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌గా, పరిగి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎప్పీలకు మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు.
కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.