Tuesday, November 26, 2024

Condolence – స్వామినాథ‌న్ మ‌ర‌ణంలో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది – సంతాప సందేశంలో కెసిఆర్

హైద‌రాబాద్ – భారత హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం ఎస్ స్వామినాథన్ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సిఎం అన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం ఎస్ స్వామినాధన్ కృషితోనే సాధ్యమైందని సిఎం కేసీఆర్ అన్నారు.

వ్యవసాయాధారిత భారత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం.ఎస్ స్వామినాథన్ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని సీఎం అన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎం.ఎస్ స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందని సీఎం అన్నారు.

దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎం.ఎస్. స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని సీఎం తెలిపారు.వ్యవసాయ రంగంలో వారు చేసిన పరిశోధనలు, సిఫారసులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని సీఎం అన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత దిశగా దార్శనికతతో జీవిత కాలం కృషి చేసిన మొట్టమొదటి వ్యవసాయ శాస్త్రవేత్త ఎం. ఎస్ స్వామినాథన్ అని సీఎం అన్నారు.

భిన్నమైన భౌగోళిక భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారిగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన ఎం.ఎస్ స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాడని సీఎం అన్నారు.

తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎం.ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎం.ఎస్ స్వామినాథన్ రాష్ట్రానికి రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సీఎం అన్నారు. ఆ సందర్భంగా వారితో జరిగిన విస్తృత స్థాయి చర్చలో వారు చేసిన పలు సూచనలు అమూల్యమైనవని సీఎం తెలిపారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను వారు ఎంతగానో ప్రశంసించారని సీఎం గుర్తు చేసుకున్నారు.

- Advertisement -

రైతు సంక్షేమం కోసం, సమ్మిళిత వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధి కోసం ఎం.ఎస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు, వారి దార్శనికత వొక రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. వొక నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, కరువు తాండవమాడిన తెలంగాణ నేలన నేడు పసిడి పంటలు పండుతుండడం వెనక, వ్యవసాయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక ఎంఎస్ స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ నేలలు అత్యంత సారమంతవైనవని, పాలకులు సరియైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్తన భాంఢాగారంగా విలసిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని వ్యవసాయరంగాభివృద్ధి గురించి తెలుసుకున్న శ్రీ ఎం.ఎస్ స్వామినాథన్ తెలంగాణను సందర్శించడానికి ఆసక్తి కనబరిచేవారని సీఎం అన్నారు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలు చూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం బాధను కలిగిస్తున్నదని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి మన్ననలు పొందడం రైతుబిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమని సీఎం అన్నారు.

ఎం.ఎస్ స్వామినాథన్ మరణం దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటని, దేశ రైతు పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం శ్రీ కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement