ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
ప్రజలకు సాయం చేతగాక సాయం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే.. బాధితులకు అండగా నిలబడడం తప్పా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే ప్రజల వద్దకు బీఆర్‌ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.