మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని ఆకుల మైలారం గ్రామంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగిన ధర్నాలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన సభలో మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర రైతుల మీద కక్ష కట్టిన కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేంద్రం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందన్నారు. రైతులు యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసి నష్టపోకుండా ఉండాలన్నారు. ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. మరో 30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతుల వద్ద ఉందని, కేంద్రం మాత్రం ఇప్పటి వరకు తీసుకుంది నామమాత్రమేనన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక లాగా, గల్లీలో మరోలాగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రైతుల కోసం పూర్తి ధాన్యం కొనుగోలు చేసేలా ముందు కేంద్రాన్ని ఒప్పించాలి.. లేదంటే బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా తెలంగాణ ప్రజలు, రైతులు చేస్తారన్నారు.
రైతులకు అండగా దేశ చరిత్రలో ధర్నా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమన్నారు. ఇప్పటికే మొదటి పంటకు ఇబ్బంది పెడుతూ, రెండవ పంట కొనమని అంటున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎక్కడిక్కడ ప్రశ్నించి నిలదీద్దామన్నారు. తెలంగాణలో రైతన్నకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరాకు 10 వేలు ఇస్తూ, ఏటా 14 వేల కోట్లు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వమన్నారు. ఇప్పటి వరకు 50 వేల కోట్లు రైతులకు రైతు బంధు ద్వారా అందజేయడం జరిగిందన్నారు. పంట సహాయం పై రైతుకు భరోసా తో పాటు, 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ పెట్టి, పంట కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అండగా ఉందన్నారు. అందువల్లనే ఇవాళ తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రాకముందు గతంలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేడు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందన్నారు. రాష్ట్రంలో గతంలో కోటి 40లక్షల మెట్రిక్ టన్నులు పండితే, ప్రస్తుతం రెండు కోట్ల 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని.. అంటే రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారం మాత్రమేనని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital