Monday, July 1, 2024

TS: న‌ల్ల‌గొండ‌లో డాక్ట‌ర్ల‌ ఆందోళ‌న‌.. క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల‌పై మండిపాటు

ప్ర‌త్యేక అధికారుల త‌నిఖీల‌పై అభ్యంత‌రం
విధులు బ‌హిష్క‌రించిన వైద్యులు
అద‌న‌పు క‌లెక్ట‌ర్ చెప్పినా ససేమిరా

నల్లగొండ, ఆంధ్ర‌ ప్రభ ప్రతినిధి : ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని ప‌రిశీలించే బాధ్య‌త జిల్లా స్థాయి అధికారుల‌కు అప్ప‌గిస్తూ క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి జారీ చేసిన ఉత్త‌ర్వుల‌పై డాక్ట‌ర్లు మండిప‌డ్డారు. దీనికి నిర‌స‌న‌గా డాక్ట‌ర్లు విధుల‌ను బ‌హిష్క‌రించి ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఆస్ప‌త్రిలో గురువారం వైద్య సేవ‌లు నిలిచిపోయాయి. ఆందోళ‌న‌కు దిగిన వైద్యుల‌ను ఒప్పించ‌డానికి అద‌న‌పు క‌లెక్ట‌ర్ పూర్ణ‌చంద్ర రావు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఇంకా ఆందోళ‌న కొన‌సాగుతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం తనిఖీ చేసేందుకు జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి న‌ల్ల‌గొండ ఆస్ప్ర‌తికి చేరుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న వైద్యులు ఆయ‌న్ని అడ్డుకున్నారు. తమ సేవల పట్ల అనుమానం వ్యక్తం చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి విషయాన్ని అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకు తెలియ‌జేశారు. హుటాహుటిన ఆయన ఆసుపత్రికి వచ్చి వైద్యులతో చర్చించారు. అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు తమ ఆందోళనను విరమించలేదు.

ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతోనే కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర చెప్పారు. అయినా వైద్యులు స‌సేమిరా అన్నారు. తాము ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు హెచ్ఓడీలకు, ఆసుపత్రి సూపరిండెంట్ కు చెబుతున్నామని వారి ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు కదా అని వైద్యులు ప్రశ్నించారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర వెనుదిరిగారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement