Tuesday, November 26, 2024

హాట్‌కేకుల్లా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీట్లు… మొదటి విడతలోనే సీఎస్‌ఈ సీట్లు 94.20 శాతం భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తొలి విడత సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 173 కళాశాలలు ఉండగా వాటిలో మొత్తం 82,666 ఇంజినీరింగ్‌ సీట్లు ఉండగా, మొదటి విడతలో 70,665 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 12,001 సీట్లు మిగిలాయి. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 5,576 సీట్లు కేటాయించారు. ఇక ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో సీట్లన్నీ దాదాపుగా నిండిపోయాయి. ట్రిపుల్‌ ఈ, సివిల్‌, మెకానికల్‌, ఇతర ఇంజినీరింగ్‌ కోర్సులకు పెద్ద ఆదరణ లభించలేదు.

కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సుల్లో మొత్తం 55,876 సీట్లకుగానూ 52,637 (94.20 శాతం) సీట్లు భర్తీ కాగా ఇంకా 3,239 సీట్లు మిగిలాయి. ఎలక్ట్రాన్రిక్స్‌, ఎలక్ట్రిక్రల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మొత్తం 17,274 సీట్లలో 13,595 (78.70 శాతం) సీట్లు కేటాయించగా 3679 సీట్లు మిగిలాయి. ఇక సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 8261 సీట్లకు 3642 (44.09 శాతం) సీట్లు భర్తీకాగా మరో 4619 సీట్లు మిగిలాయి. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 1255 సీట్లకుగానూ 791 (63.03 శాతం) సీట్లు కేటాయించగా 464 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. మొత్తంగా 82,666 సీట్లలో 70,665 సీట్లు (85.48 శాతం) సీట్లు మొదటి విడతలో అభ్యర్థులకు కేటాయించగా ఇంకా 12001 సీట్లు మిగిలాయి. 173 కాలేజీల్లో 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేట్‌ కాలేజీల్లో 100 శాతం సీట్లు మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి.

- Advertisement -

కంప్యూటర్‌ సైన్స్‌ ఐటీ సంబంధిత బ్రాంచిల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టం, సీఐసీ, సీఎస్‌ఎన్‌, సీఎస్‌ఏలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన కోర్సులైన సీఎస్‌ఈ, ఐఎన్‌ఎఫ్‌, సీఎస్‌, సీఎస్‌సీ కోర్సుల్లో 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. అత్యల్పంగా సీఎస్‌డబ్ల్యూ (సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీరింగ్‌) కోర్సులో 182 సీట్లకు కేవలం 51 సీట్లు (28 శాతం) మాత్రమే నిండాయి.

ఈఈఈలో బీఎంఈ 100 శాతం, ఈసీఐ, ఈటీఎంలో మాత్రమే 100 శాతం సీట్లు నిండగా మిగిలిన కోర్సుల్లో తక్కువగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 21 సీట్లల్లో ఒక్క సీటు కూడా నిండలేదు. సివిల్‌, మెకానికల్‌ బ్రాంచీలో సివిల్‌ ఇంజనీరింగ్‌లో 44.76 శాతం సీట్లు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 38.50 శాతం, మెటలార్జీ మెటీరియల్‌ ఇంజనీరింగ్‌లో 28.26 శాతం సీట్లు, ప్లానింగ్‌లో 13.95 శాతం, ఇండస్ట్రీయల్‌ ప్రొడక్షన్లో సున్నా సీట్లు భర్తీ అయ్యియి.

అదేవిధంగా ఇతర ఇంజనీరింగ్‌ కోర్సులైన బిల్డింగ్‌ సర్వీసెస్‌ ఇంజనీరింగ్‌లో 6.25 శాతం, ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌లో 15.22 శాతం, టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో 36.15 శాతం, మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో 45.87 శాతం సీట్లు, బయోటెక్నాలజీలో 73.72 శాతం, ఫుడ్‌ టెక్నాలజీలో 72.45 శాతం, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 98.65 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం లక్షకు పైగా సీట్లు ఉండగా వాటిలో 82,666 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి. 2022లో కన్వీనర్‌ కోటా సీట్లు 78338 ఉన్నాయి.

కాలేజీలు సంఖ్య మొత్తం సీట్లు కేటాయించిన సీట్లు మిగిలిన సీట్లు శాతం

వర్సిటీలు 16 5176 4406 770 85.12
ప్రైవేట్‌ వర్సీటీ 2 1497 1124 373 75.08
ప్రైవేట్‌కాలేజీలు 155 75993 65135 10858 95.71
మొత్తం 173 82666 70665 12001 85.48

22లోగా రిపోర్టింగ్‌ చేయాలి…

76,821 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాగా, ఆప్షన్లు ఇచ్చుకున్నవారు 75708 మంది ఉన్నారు. వచ్చిన మొత్తం అప్షన్లు 50,44,634 ఉన్నాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ తెలిపారు. ఈనెల 24 నుంచి రెండో విడత సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. మొదటి విడతలో మిగిలిన సీట్లను రెండో విడతలో, ఫైనల్‌ ఫేజ్‌లో భర్తీ చేస్తారు. మరోవైపు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు ఇప్పటికే దాదాపు అన్ని ప్రైవేట్‌ కాలేజీల్లో భర్తీ అయిపోయాయి. డిమాండ్‌ ఉన్న ఒక్కో సీటును రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు విక్రియించారనే ఆరోపణలున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement