Home తెలంగాణ‌ ఖ‌మ్మం TG | విద్యార్థుల ఉన్నతి కోసమే కామన్ డైట్.. ఉప ముఖ్యమంత్రి భట్టి

TG | విద్యార్థుల ఉన్నతి కోసమే కామన్ డైట్.. ఉప ముఖ్యమంత్రి భట్టి

0
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు
  • విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా చర్యలు
  • 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను ప్రజా ప్రభుత్వం పెంపు
  • 5 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం
  • గురుకులాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపు


బోనకల్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఉప ముఖ్యమంత్రి
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14 : రాష్ట్రంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడేలా ప్రజా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తో కలిసి మధిర నియోజకవర్గం బోనకల్ లోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో కామన్ డైట్ మెనూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు వాయిస్తూ జిల్లా అధికారులు, గురుకుల పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.

ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెనూను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. కామన్ డైట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని డిప్యూటీ సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ… మానవ వనరులే రాష్ట్రంలో బలమైన వనరులని, వీరి అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. రేపటి తెలంగాణ భవిష్యత్తు నేటి విద్యార్థులపై ఆధారపడి ఉందని, విద్యార్థులు బలమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఎదిగే దిశగా ప్రజా ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకుందన్నారు.

ప్రపంచంతో పోటీపడే విద్యార్థులను తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం దృడ నిశ్చయంతో అడుగులు వేస్తుందని, మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల దేహా దారుఢ్యం, మేదస్సు ఎదుగుదల నమోదు అవుతుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యం చేసి డైట్ చార్జీలను గణనీయంగా పెంచి, నూతన డైట్ ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వం తమ కోసం ఉందనే నమ్మకం చదివే పిల్లలకు, తల్లిదండ్రులకు కలగాలని ఉద్దేశంతో కామన్ డైట్ లంచ్ కార్యక్రమం చేపట్టామని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

పిల్లలు బాగా చదువుకొని విజయం సాధించాలని, విద్యార్థులు విజయం సాధిస్తే ప్రభుత్వం చాలా సంతోష పడుతుందన్నారు. పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాఠశాలల్లో ఉన్న మౌళిక వసతులు అంశంలో గత పది సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డైట్ చార్జీలు పెరగకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక ఉపాధ్యాయులు చాలా కష్టాలు పడ్డారని, వీటిని గమనించిన ప్రజా ప్రభుత్వం కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా 15రోజుల్లో నివేదిక తెప్పించుకొని 40 శాతం డైట్ చార్జీలు పెంచామని తెలిపారు. డైట్ చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందన్నారు.

అదేవిధంగా కాస్మోటిక్ చార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు, బాలురు 7వ తరగతి వరకు 62 నుంచి 150 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి 200 రూపాయలకు పెంచినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీలు రాష్ట్రంలోని 8లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడతాయని, దీనివల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని, ఖజానాపై భారం పడిన పిల్లల భవిష్యత్తు కోసం భరిస్తున్నామని, వైద్యులతో సంప్రదించి పిల్లల ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పోషకాలు అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు.

విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రూ.5వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను నిర్మిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియాలనే ఉద్దేశంతో వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి సమీకృత గురుకులాల్లో అడ్మిషన్స్ దొరికే వరకు అవసరమైన పాఠశాలల నిర్మాణం చేస్తామన్నారు. బోనకల్ మండలం లక్ష్మీపురం వద్ద యంగ్ ఇండియా సమీకృత విద్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశామని, త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి నెలల తరబడి గురుకులాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వీటిని పరిశీలించి పూర్తి స్థాయిలో క్లియర్ చేశామన్నారు. గురుకులాలకు వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇకపై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, ఎక్కడ నాణ్యత లోపించినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలలో పరిశుభ్రతకు ఎక్కడా లోటు లేకుండా అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అధ్యాపకులు అంతే జాగ్రత్తగా చూసుకోవాలని, మన గురుకులాల్లో చదివే పిల్లల పట్ల మనం బాధ్యతతో ఉండాలని, ఉపాధ్యాయులు పిల్లలచే పూజింపబడాలని కోరుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు మహిళా సంఘాలచే కల్పించామని, గతంలో నిర్లక్ష్యం వహించిన డీఎస్సీని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టి 11వేల మంది టీచర్లను భర్తీ చేశామని, త్వరలో మరో 6000 టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 55వేలకు పైగా నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని, ప్రభుత్వంలో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, స్వయం ఉపాధి ద్వారా మిగిలిన యువకులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా 40శాతం డైట్ చార్జీలను పెంచడం ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా నడిచే కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ గురుకులాలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలు అమలు అవుతాయన్నారు. అంతకు ముందు కార్యక్రమంలో గురుకులంలో 10వ తరగతి చదువుతున్న గిరీష్ అనే విద్యార్థి మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో పిల్లల ఆరోగ్య చెక్ అప్, పౌష్టికాహారం అందేది కాదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిల్లలకు మంచి ఆహారం అందుతుందని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ జరుగుతున్నాయన్నారు. డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని, ఇందుకు గాను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విద్యార్థి తెలిపారు.

గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదివే లోకేష్, జగదీష్ విద్యార్థుల తండ్రి నరేష్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారని, పాఠశాలలో డైట్ చార్జీలతో పాటు సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, తన ఇద్దరు పిల్లలు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. బోనకల్ మండలంలోని విద్యార్థుల పట్ల ప్రత్యేకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి చల్లని చూపు ఉంటుందన్నారు.

గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే గిరిష్ తల్లి మాట్లాడుతూ… గతంలో తన కుమారుడు ఇక్కడ చదివేందుకు నిరాకరించాడని, డార్మెంటరీ, ఫుడ్ బాగా ఉండేవి కాదని, ఇక్కడి ప్రిన్సిపల్ తన పిల్లలుగా భావించి బాగా శ్రద్ధ వహించారని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పిల్లలకు సౌకర్యాలు బాగా ఉన్నాయని తెలిపారు. గురుకులాల్లో పదవ తరగతి తర్వాత ఇంటర్ విద్య మాత్రమే ఉంటుందని, డిప్లోమా వంటి కోర్సులు కూడా ఉండేలా చూడాలని ఆమె ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహా రావు, ఆర్.సి.ఓ., ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version