ప్రభన్యూస్ : రొయ్య పిల్లల పంపిణీకి కమిటీని నియమించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్య్సశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదేశించారు.ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో.. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో చేపట్టిన రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఒకటి, రెండు ప్రాంతాలలో నిబంధనలను పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవక తవకలు జరిగినట్లు నిర్ధారణ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మత్స్యకారులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని పలు నీటి వనరులలో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తుందని తెలిపారు. మత్స్యకారులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే ఆలోచనతో రాష్ట్రంలో అనువైన మంచినీటి వనరులలో రొయ్య పిల్లలను విడుదల చేయాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు.
ఇప్పటి వరకు 140 నీటి వనరులలో 5.34 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని వివరించారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్, నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజక వర్గ పరిధిలోని కొండ భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్య పిల్లల నాణ్యత, లెక్కలలో నిబంధనలు పాటించలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఇవి పున రావృతం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఉపేక్షించవద్దని మంత్రి ప్రకటనలో స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital