హైదరాబాద్: రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడించారు మంత్రి కెటిఆర్ .. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. అదేవిధంగా స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. 2001 నుంచి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నిలిచారని వెల్లడించారు. దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వెల్లడించారు. లోయర్ ట్యాంక్‌బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలని కెటిఆర్ పిలుపు ఇచ్చారు.