Friday, November 22, 2024

Exclucive – కామ్రేడ్స్ మ‌ధ్య‌ రెడ్‌ లైట్‌! – కూట‌మిలోనే కుంప‌ట్లు

సీపీఐ – సీపీఎం మధ్య దూరం దూరం
భువనగిరి లోక్‌సభకు పోటీప‌డుతున్న వామ‌ప‌క్షాలు
21, 22న సీపీఐ కార్యవర్గ సమావేశం
క‌రీంన‌గ‌ర్‌, భువ‌న‌గిరి సీటు కోసం ప‌ట్టు
కాంగ్రెస్ పార్టీతో కొన‌సాగుతున్న మంత‌నాలు
అసెంబ్లీ మాదిరిగానే స్ట్రాట‌జీ అమ‌లు
ఒంట‌రి పోరుకే రెడీ అంటున్న సీపీఎం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

లోక్‌సభ గోదాలోకి దూకేందుకు కామ్రేడ్స్‌ సిద్ధమవుతున్నారు. వామపక్షాల ఐక్యత పక్కకుపెట్టి ఎవరికి వారే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రాజకీయ ఎత్తుగడలను రచిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎం రాష్ట్రంలో మాత్రం సొంత‌ పార్టీ ఏజెండాలతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు పార్టీల మధ్య నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ ఇప్పటి వరకు వామపక్షాల పొత్తులపై ప్రస్తావించడం లేదు. దీంతో వామపక్షాలు మాత్రం ఇంకా ఆశలతోనే ఉన్నాయి. సీపీఐ ఇప్పటికే భువనగిరి, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్ లోక్‌స‌భ‌ నియోజకవర్గాల నుంచి పోటీచేయనున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే.. కాంగ్రెస్‌తో అవగాహన కుదిరితే భువనగిరి స్థానానికి పరిమితం అయ్యే ఆలోచనలో కూడా ఉంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతున్నారు.

భువ‌న‌గిరి, క‌రీంన‌గ‌ర్ కోసం సీపీఐ ప‌ట్టు

గతంలో ఖమ్మం నుంచి పోటీచేసి ఓటమి చవిచూసిన నారాయణ అవకాశం కల్పిస్తే తిరిగి పోటీచేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రాభల్యం ఉన్న కరీంనగర్ లోక్‌స‌భ‌ నియోజకవర్గం నుంచి పోటీకి ఆయ‌న ఈసారి సిద్ధమవుతున్నారు. సింగరేణి బొగ్గు బావి కార్మిక సంఘాల్లో ప్రాబ‌ల్యం ఉన్న సీపీఐ కరీంనగర్‌ స్థానాన్ని కూడా కోరుకుంటుంది. భువనగిరి లేదా కరీంనగర్‌పై కాంగ్రెస్‌తో పట్టుపట్టే అవకాశాలు అధికంగా ఉన్న‌ట్టు స‌మాచారం అందుతోంది.

కార్యవర్గ సమావేశంలో నిర్ణయం

- Advertisement -

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయాలు తీసుకుకొనున్నారు. ఈనెల 21, 22న జరగనున్న సీపీఐ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా రానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్న లోక్‌సభ స్థానాలపై చర్చజగనున్నట్లు కామ్రేడ్స్ అంటున్నారు. కాంగ్రెస్‌ పొత్తుకు సై అనకపోతే ముందుగా ప్రకటించిన నాలుగు లోక్‌స‌భ‌ స్థానాల్లో పోటీకి సీపీఐ సిద్ధం అవుతోంది. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్‌ పొత్తుతో ఒక శాసన సభస్థానాన్ని గెలుచుకున్న సీపీఐ.. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే వ్యూహం అనుసరించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఒంటరిపోరుకే సిద్ధమవుతున్న సీపీఎం

శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా 19 నియోజకవర్గాల్లో పోటీచేసిన‌ సీపీఎం.. తిరిగి అదే పంథా అవలంభించేందుకు సిద్ధమవుతోంది. సీపీఐ భువనగిరి స్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నా.. సీపీఎం కూడా అదే లోక్‌స‌భ‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవసరమైన రాజకీయ ప్రక్రియ ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఎన్‌డీఏకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం అయినప్పటికీ.. రాష్ట్రంలో కలిసివచ్చే వామపక్షాలతో కలిసి భువనగిరి లోక్‌స‌భ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అయితే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో చర్చలు జరిపేందుకు యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో అవగాహన కుదిరినా.. కుదరకపోయినా భువనగిరి నుంచి పోటీ చేయడం ఖాయమని ఆపార్టీకి చెందిన పోలిట్‌ బ్యూరో సభ్యుడు స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement