హుజూర్ నగర్ – బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కళాశాల విద్యను నిర్లక్ష్యం చేశారని ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, నూతన భవనాల మంజూరుపై అధికారులతో ఇవాళ ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిందీ, అభివృద్ధి చేసేది తామేనని తెలిపారు. పది సంవత్సరాలు కళాశాలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. కాలేజీకి అవసరమైన ప్రతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాలేజీ అధ్యాపకులు కూడా అడ్మిషన్ పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మంత్రి అన్నారు. సమాజంలోనే గొప్ప వృత్తి అధ్యాపక వృత్తి.. దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని మంత్రి అన్నారు.
సమీక్ష అనంతరం రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న గరిడేపల్లి నుంచి అలింగాపురం రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తరువాత రూ.30కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు.. ఇక అక్కడ నుంచి నేరేడుచర్ల వెళ్లిన మంత్రి అక్కడ, రూ.2 కోట్లు విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.