ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని విద్యార్థులకు రోడ్డు కష్టాలు తప్పడం లేదు. చినుకు పడితే స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల జూనియర్ కళాశాలలో సుమారు 800 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇదే రహదారిలో బీసీ విద్యార్థులకు బాలికల వసతి గృహం కస్తూర్బా బాలికల విద్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎఫ్సిఐ గోదాం ఉన్నాయి. నిత్యం ఈ రహదారి మీదుగా వేల సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. మండల్ రోడ్ లోని సుమారు 50 మీటర్ల పరిధిలో రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది.
ఇదే రహదారి మీదుగా టి ఎస్ మోడల్ స్కూల్ కు సుమారు 800 మంది విద్యార్థులు, బీసీ హాస్టల్ నుండి విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్తుంటారు. వర్షం పడితే రోడ్డంతా బురదమయం కావడంతో దాదాపు 10 కిలోలకు పైగా ఉన్న స్కూల్ బ్యాగ్ తో సాహసాలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. విద్యార్థులను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లే తల్లిదండ్రులు, వాహన దారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్దిపాటి ప్రమాదం అయినా బురదగుంటలో పడాల్సిన పరిస్థితి దాపురించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అధికారులు, పాలకులు ఈ రోడ్ మీదుగానే ప్రయాణిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పాఠశాలకు వెళ్లే రహదారికి మరమ్మతు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.