(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి మెదక్) : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై గురువారం ఆంధ్రప్రభలో వచ్చిన పటేల్ గూడలో గూడుపుఠాణి కథనానికి అధికారులు స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం పటేల్ గూడలో అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్లను శుక్రవారం తెల్లవారు జామునుంచే కూల్చివేతలు మొదలుపెట్టారు.
సుమారుగా పది ఇళ్లు ధ్వంసం చేసినట్టు జిల్లా అధికారులు తెలిపారు. అక్రమ వెంచర్లు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఎవరు కబ్జాలకు పాల్పడిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మండల అధికారులకు కలెక్టర్ సూచించారు.
అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పంచాయితీ రాజ్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో ఇక్కడి బిల్డర్లు ఫోర్జరీ సంతకాలతో మాయచేసి ఇల్లీగల్ లే-అవుట్లు సృష్టించడం, కాలం చెల్లిన అనుమతులతో ఇండిపెండెంట్ గృహాలను నిర్మించి విక్రయించడం చేస్తున్నారని ఆంధ్రప్రభ పత్రికల్లో వస్తున్న కథనాలపై అధికారులు దృష్టి పెట్టారు.
పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతూ అక్రమ లే అవుట్లను చేసి అమాయకులకు కట్టబెడుతున్న వైనంపై పూర్తి విచారణ చేయాలని జిలాల్లో ఇంకా అనధికార వెంచర్లు, అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు..