Friday, December 27, 2024

Collector Attack Case – పట్నం నరేందర్ రెడ్డికి ఐజీ వార్నింగ్

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయమని కోర్టును కోరుతామని ఐజీ సత్యనారాయణ అన్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడంపై ఐజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కండిషన్ బెయిల్‌పై బయట ఉండి, ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు.

ఈ క్రమంలో ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరుతామన్నారు. కేసు విచారణ కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో ఆయన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. లగచర్ల ఘటన జరిగిన రోజున 230 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని, కాబట్టి ఇందులో పోలీసుల వైఫల్యం ఉందని చెప్పడం సరికాదన్నారు. కలెక్టర్ మీద దాడి చేసినందుకే నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.పోలీసులు కొట్టినట్లుగా వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

పట్నం నరేందర్ రెడ్డిని ఫార్మా భూసేకరణకు సంబంధించిన అంశంలో అరెస్ట్ చేయలేదని, కలెక్టర్ మీద దాడి కేసులో అరెస్ట్ చేశామన్నారు. అనుమానితులను తాము మూడు విడతల్లో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వారిని తాము వదిలేశామన్నారు.

- Advertisement -

పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో అవాస్తవాలు చెప్పడం సరికాదన్నారు.ఏ ప్రభుత్వం కూడా రైతుకు బేడీలు వేయమని చెప్పదని, నిందితుడు సురేశ్ వాయిస్ రికార్డ్ తమ వద్ద ఉందన్నారు. దాడి ఘటనను ప్లాన్ చేసింది అతనే అన్నారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతామని వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదన్నారు. నరేందర్ రెడ్డి, సురేశ్ ఈ కేసులో విచారణకు సహకరించడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement