హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌లో రోడ్ల మూసివేతకు వ్యతిరేకంగా స్థానికులు సంతకాల సేకరణను ప్రారంభించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ రోడ్లను మూసివేస్తే.. తాము నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానికులు బోర్డుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. రెండు రోజుల కింద రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కంటోన్మెంట్ బోర్డు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను స్పందించిన కేటీఆర్.. బోర్డు అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు మూసివేస్తే తాము సైతం ఆ ఏరియాకు నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్‌లో చెక్ డ్యామ్ నిర్మించి నీళ్లు ఆపడంతో అక్కడే ఉన్న నదీం కాలనీ మునిగిపోతుందన్నారు. హైదరాబాద్‌లోనే ఉన్న కంటోన్మెంట్.. స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి పని చేయకపోతే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు.