తెలంగాణలోకి నైరుతి పవనాలు రానున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఐఎండీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి… దీంతో నగర ప్రాంతాలు చల్లబడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఉత్తర తెలంగాణ ప్రాంతంతో మినహా ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఈ నెల 4, 5 తేదీల్లో వర్ష సూచన కారణంగా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జూన్ 6 వరకు ఎల్లో అలర్ట్ అమలులో ఉంటుందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 6 తర్వాత హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.