చట్టపరమైన అధికారాలను కట్టడి చేయలేని స్థితిలో ఉన్న సర్కారుకు ఏ మార్గమూ కనిపించడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షనాధికారాలు ఉన్నాయి. పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోలేక తాజాగా గవర్నర్ వాటిని కేంద్ర హోం శాఖకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్న పెండింగ్ బిల్లులకు రాజకీయ రంగు అంటుకుంటోంది…
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అసలే కేంద్ర ప్రభుత్వంతో కొనసాగుతున్న పంచాయతీ.. ఈ తరుణంలో ఏం చేయాలో మార్గం తోచక సీఎం కేసీఆర్ అయోమయ స్థితిలో ఉన్నారు. అన్ని కోణాల్లో న్యాయపరమైన మార్గంలోనే ప్రొసీజర్ పూర్తిచేసుకున్న ముసాయిదా బిల్లులు, పరిశీలన పేరుతో రాజ్‌భవన్‌లో గత ఆరునెలల కాలంగా అటకెక్కాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, రాజ్యాంగాధిపతితో తలెత్తిన విభేదాలతో పరిపాలనా పరమైన నిర్ణయాల్లో ఆటంకాలు, చిక్కుముడులు ఏర్పడుతున్నాయి. ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా గవర్నర్ తమిళిసై ప్రభుత్వాన్ని మెచ్చుకున్న నేపథ్యంలో తదనంతరం రెండు, మూడు రోజుల్లోనే బిల్లులు ఆమోదిస్తారని అంతా భావించారు. కానీ అదేమీ జరుగలేదు. దీంతో సీఎం కేసీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ప్రధానంగా కొత్త పురపాలక చట్టం ప్రస్తుతం తక్షణ అవసరంగా మారింది. పాత చట్టం ప్రకారం మూడేళ్ల గడువు ముగియడంతో అనేక పురపాలక సంఘాల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అది ఇటు ప్రభుత్వానికీ, అటు జిల్లా కలెక్టర్లకు సమస్యాత్మకంగా మారుతోంది. గవర్నర్ ఆమోదించి గెజిట్ విడుదలైతే తప్ప చట్టం అమల్లోకి రాదన్నది వాస్తవం. అప్పటి వరకు ఆగని అవిశ్వాసాలపై ప్రభుత్వంలో అలజడి ప్రారంభమైంది. స్థానిక రాజకీయాల ప్రాబల్యంతో అవిశ్వాస తీర్మానాలను ఆమోదించాలన్న ఒత్తిడి, డిమాండ్ పెరుగుతోంది. నెల గడువులోగా ఆమోదించకుంటే కలెక్టర్లపై ఉల్లంఘన కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఏం చేయాలో చెప్పాలంటూ.. ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందాయి.
చట్టపరమైన అధికారాలను కట్టడి చేయలేని స్థితిలో ఉన్న సర్కారుకు ఏ మార్గమూ కనిపించడం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షనాధికారాలు ఉన్నాయి. పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోలేక తాజాగా గవర్నర్ వాటిని కేంద్ర హోంశాఖకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు లేవు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్న ఈ పెండింగ్ బిల్లులకు రాజకీయ రంగు అంటుకుంటోది. మరోవైపు తెలంగాణ నుంచి తమిళిసై బదిలీ అవుతున్నారన్న పుకార్లు జోరందుకున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో, తెలియదు కానీ.. ప్రస్తుతానికి కేసీఆర్ సర్కారు అయోమయంలో పడింది.
నెలలు గడుస్తున్నా, వీడని ఉత్కంఠ!
ఏడు పెండింగ్ బిల్లులతో పాటు తాజాగా ప్రభుత్వం అసెంబ్లిdలో ఆమోదించి పంపిన మూడు కొత్త బిల్లులు కలిపి మొత్తం 10 బిల్లులు రాజముద్ర కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోద ముద్ర వేసిన గవర్నర్ తమిళిసై మిగిలిన బిల్లులకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదు నెలలు గడచినప్పటికీ బిల్లులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లోనే ఉన్నాయి. తాజా బడ్జెట్ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లులతో పాటు మరో మూడు బిల్లులపై కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
చట్టం ఆమోదం పొందకుంటే అడ్మిషన్లు రద్దు
రాష్ట్రంలోని మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ బిల్లు తెచ్చింది. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పనకై బిల్లును తెచ్చింది. ఈ చట్టం ఆమోదం పొందకుంటే ప్రైవేటు యూనివర్సిటీల్లో వేలాది విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది.
చట్టాలు అమల్లోకి వస్తేనే ఖజానా గలగల
వీటితో పాటు పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టం, జీఎస్టీ చట్టాలను కూడా సవరిస్తూ బిల్లులను తీసుకొచ్చింది. జీ హచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ చేస్తూ మరో బిల్లును తీసుకొచ్చింది. అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపు దాల్చింది. మిగిలిన ఏడు బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తేనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు.
విద్యా మంత్రి వివరణ ఇచ్చినా… నో ఛాన్స్
గవర్నర్ పరిధిలో ఉన్న మిగతా ఆరు బిల్లులకు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. గవర్నర్ వద్దే పెండింగ్‌లోనే ఉన్నాయి. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై విద్యాశాఖ మంత్రి, అధికారులను పిలిపించి మరీ వివరణ తీసుకున్నారు. ఆ బిల్లు సహా ఏవీ కూడా ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. బడ్జెట్ సమావేశాల అంశానికి సంబంధించిన ప్రతిష్టంభన వీడిన సమయంలో పెండింగ్ బిల్లుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోరినట్లు తెలిసింది. వివరణలు తీసుకొని బిల్లులు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజ్‌భవన్ తరఫు న్యాయవాది అన్నట్లు సమాచారం.
పరిశీలనలో ఉన్నాయి: గవర్నర్
ఈ బిల్లులు పెండింగ్‌లో లేవని, పరిశీలనలో ఉన్నాయని, ఒక బిల్లుకు సంబంధించి రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి వివరణ కూడా తీసుకున్నామని.. పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు గత నెలలో గవర్నర్ బదులిచ్చారు. దాదాపు ఆరు నెలలుగా ఆరు బిల్లులకు ఆమోదం తెలపని పరిస్థితుల్లో.. రాజ్‌భవన్ అధికారులు, గవర్నర్ ఢిల్లి వెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
తుది నిర్ణయం రాష్ట్రపతిదే..
ఈ బిల్లులను ఆమోదించడమా? లేక తిరస్కరించడమా? లేదంటే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడమా? వంటి తదితరాలపై ఢిల్లిలో చర్చలు జరిపే చాన్స్ ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్నందున వీటికి ఆమోదం తెలిపే విషయంలో నిపుణులు, అధికారుల నుంచి వచ్చే అభిప్రాయానికి అనుగుణంగా తమిళిసై సౌందర్ రాజన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
గవర్నర్ మార్పుపై ఆసక్తికర చర్చలు
తొందర్లోనే 8 రాష్ట్రాల గవర్నర్‌లను మార్చుతారన్న ఊహాగానాలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ ఇప్పటికే స్వచ్ఛందంగా తప్పుకోనున్నట్టు ప్రకటించారు. గవర్నర్‌ల బదిలీల సమయంలో అక్కడికి కొత్త గవర్నర్‌ను నియమించడంపై లీకులు కూడా వెలువడ్డాయి. పంజాబ్‌కు చెందిన కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను అక్కడ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. బదిలీకి అయ్యే ఎనిమిది మంది గవర్నర్‌లలో తమిళిసై పేరు కూడా ఉన్నట్లు నెల రోజుల క్రితమే లీకులు వచ్చాయి. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొదటి సెషన్ పూర్తికాగానే గవర్నర్ల బదిలీ ఉండొచ్చని కేంద్ర వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
పాతవి ఏడు, కొత్తవి మూడు..?
2022 సెప్టెంబర్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం 8 బిల్లులను తీసుకొచ్చింది. అందులో 2 కొత్త బిల్లులు కాగా, మిగతా 6 చట్టసవరణలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. అసెంబ్లిd, కౌన్సిల్ ఆమోదం అనంతరం ఆమోదం కోసం వాటిని రాజ్‌భవన్‌కు పంపారు. అయితే అందులో ఒక్క జీఎస్టీ చట్టసవరణ బిల్లు మాత్రమే ఆమోదం పొంది చట్టంగా రూపుదాల్చింది. మిగిలిన ఏడు బిల్లులకు ఇంకా ఆమోదముద్ర పడలేదు. ఈ ఏడు బిల్లుల్లో అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టసవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాల్సి ఉంటుంది. కేంద్ర చట్టంతో ముడిపడి ఉన్నందున రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. మిగతా ఆరు బిల్లులకు కూడా ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు.
గెజిట్ వెలువడని బిల్లులివే…
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేసేలా చట్టం చేసేందుకు సర్కార్ బిల్లు.
సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీకళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ చట్టం రూపకల్పన కోసం బిల్లు.
మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరిస్తూ బిల్లు.
జీహచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ చేస్తూ బిల్లు
పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం సవరణ బిల్లు.
అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్టాన్ని సవరిస్తూ బిల్లు.
ఇప్పుడున్న జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లు.
తాజాగా 10కి చేరిన పెండింగ్ బిల్లుల సంఖ్య
ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులతో పాటు.. మరో మూడు బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. పురపాలక, పంచాయతీరాజ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణల బిల్లులు అందులో ఉన్నాయి. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. మిగతా బిల్లులను మాత్రం ఇంకా ఆమోదించలేదు. దీంతో గవర్నర్ ఆమోదించాల్సిన మొత్తం బిల్లుల సంఖ్య పదికి చేరుకొంది.