ఎఫ్‌సీఐ గోడౌన్ల వద్ద పడిగాపులు
ఖమ్మంలో రోజుకు వంద లారీలు
ఒక్క లోడు కోసం వారం నిరీక్షణ
లోడింగ్ లారీల వెయిటింగ్‌కు రూ.10 వేల అదనపు భారం
పెండింగ్ సీఎంఆర్ ఎగవేతదారులకే అధికారుల పెద్దపీట
సూర్యాపేట నుంచి వచ్చే లారీకి రూ.30 వేలు, భద్రాద్రి నుంచి వెళ్లే లారీకి రూ.25 వేలు చెల్లింపు
రవాణా ఛార్జీలతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం
బియ్యం దిగుమతి సమస్యపై కమిషనర్, జిల్లా కలెక్టర్లకు మిల్లర్ల వినతి
భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్ ప్రతినిధి: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం దిగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైస్ మిల్లర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది 2022-23 సంవత్సరంలోని ఖరీఫ్ (వర్షాకాలం పంట)సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం జిల్లాలోని రైస్ మిల్లర్లకు అప్పగించారు. జిల్లాలోని 35 రైస్ మిల్లులకు పౌర సరఫరాల శాఖ అధికారులు సీఎంఆర్ బియ్యం మిల్లింగ్ కోసం అప్పగించారు. రైతుల నుంచి సేకరించిన ఒక లక్షా 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా ఇప్పటికే పదివేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఖమ్మంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు మిల్లర్లు రవాణా చేశారు. ఇంకా జిల్లాలో 72 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేయాల్సి ఉండగా ఖమ్మంలోని ఎఫ్‌సీఐ గోడౌన్ల వద్ద బియ్యాన్ని దిగుమతి చేసుకోవడంలో సమస్యలు తలెత్తు తున్నాయి. గోడౌన్‌లో పని చేసే హమాలీలకు నెలకు రూ. లక్ష జీతం మించకూడదనే నిబంధనలు ఉండటంతో అక్కడ పని చేసే హమాలీలు రోజుకు 40 ఏసిక్‌లు 1160 మెట్రిక్ టన్నులు (40లారీలు) బియ్యాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు నాలుగు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఈ ఒక్క గోడౌన్‌లోనే సీఎంఆర్ బియ్యం దిగుమతి చేస్తున్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్‌లోనే బియ్యం దిగుమతికి సంబంధించి భద్రాద్రి జిల్లా నుంచి పది లారీల బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని అక్కడి అధికారులు నిబంధనలు పెట్టడంతో బియ్యం దిగుమతి వ్యవహారంలో మిల్లర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్క బియ్యం లారీని ఖమ్మంకు పంపిస్తే దిగుమతి అయ్యేందుకు ఐదు రోజుల నుంచి వారం రోజుల వ్యవధి పడుతుంది. దీంతో బియ్యం లోడింగ్ అయిన ఒక్క లారీకి వెయిటింగ్ చార్జీల కింద రూ. 10వేలు అదనపు భారం రైస్ మిల్లర్లపై పడుతోంది. ఎఫ్‌సీఐ బియ్యం దిగుమతుల్లో చోటు చేసుకున్న సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల దృష్టికి రైస్ మిల్లర్లు ఈ సమస్యను తీసుకెళ్లారు. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం లభించకపోవడంతో తాము మిల్లింగ్ చేసిన బియ్యం సరఫరాకు పది నుంచి 12 నెలల కాలం పట్టే అవకాశాలు ఉన్నట్లు రైస్ మిల్లర్లు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. సీఎంఆర్ మిల్లింగ్ కోసం బీహార్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కార్మికుల ఉపాధిపై ఈ ప్రభావం పడుతోంది.
భద్రాద్రి జిల్లాకు అవసరమైన పీడీఎస్ బియ్యం… సూర్యాపేట డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు అప్పగింత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే పీడీఎస్ బియ్యం మిల్లింగ్ బాధ్యతలను 2021-22లో సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ బియ్యం సరఫరాలో డిఫాల్టర్లైన మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ అధికారులు సరఫరా బాధ్యతలను అప్పగించడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్ బియ్యం సరఫరాకు అవకాశం ఉన్నప్పటికీ సూర్యాపేట జిల్లాకు చెందిన పెండింగ్ సీఎంఆర్ మిల్లింగ్ ఎగవేతదారులకు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారులపై ఒత్తిడి చేసి పీడీఎస్ బియ్యం సరఫరా కట్టబెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ప్రతి నెలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని ప్రజలకు సరిపడా బియ్యాన్ని ఇక్కడే సేకరించి నిల్వ చేయాల్సి ఉండగా సూర్యాపేట జిల్లా నుంచి అదనపు ఖర్చులతో భద్రాద్రి జిల్లాకు సరఫరా చేయడం వెనుక రాష్ట్ర స్థాయిలో అదృశ్య శక్తులు చక్రం తిప్పారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి భద్రాద్రి జిల్లాకు సరఫరా చేసే లారీ బియ్యానికి రూ.30 వేలు రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌కు బియ్యం సరఫరా చేసే లారీకి రూ.25 వేలు చొప్పున రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అవసరమైన ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ జిల్లాకు అవసరమైన పీడీఎస్ బియ్యాన్ని సూర్యాపేట జిల్లా నుంచి ఇక్కడికి తరలిస్తుండటంతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఓ పక్క భద్రాద్రి జిల్లాలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఖమ్మంలోని ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తుండగా అక్కడ ఎఫ్‌సీఐ అధికారులు పెట్టిన నిబంధనలతో మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి జిల్లాకు అవసరమైన పీడీఎస్ బియ్యాన్ని జిల్లాలోని 35 రైస్ మిల్లర్లకు అప్పగిస్తే బియ్యం సరఫరాకు సంబంధించి రవాణా భారం తగ్గడంతో పాటు భద్రాద్రి జిల్లా రైస్ మిల్లర్ల సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సీఎం కేసీఆర్, మంత్రి గంగులను కలవనున్న రైస్ మిల్లర్లు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌లను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి కొత ్తగూడెం జిల్లాలో సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఖమ్మం ఎఫ్‌సీఐకి సరఫరా చేసే విషయంలో తలెత్తుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మార్కెట్ కమిటీలకు సంబంధించి 40వేల టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌లు ఖాళీగా ఉన్నట్లు రైస్ మిల్లర్లు పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 35 రైస్ మిల్లుల నుంచి 80 నుంచి 100 లారీల బియ్యం మిల్లింగ్ అవుతున్నట్లు తెలిపారు. నెలకు 2,200 లారీల బియ్యం మిల్లింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఖమ్మం ఎఫ్‌సీఐలో గోడౌన్‌లో రోజుకు 10 నుంచి 15లారీల లోపే బియ్యం లారీలను దిగుమతి చేసుకుంటున్నారని మిల్లర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీడీఎస్ బియ్యం సరఫరాకు అవసరమైన బియ్యం జిల్లాలోనే ఉన్నాయన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి భద్రాద్రి జిల్లాకు తరలిస్తున ్న బియ్యం సరఫరాను పౌర సరఫరాల శాఖ అధికారులు నిలిపివేసి తమ జిల్లా నుంచి సీఎంఆర్ బియ్యాన్ని తీసుకుని పరిశ్రమను కాపాడి కార్మికులకు ఉపాధి కల్పించాలని సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌లను కోరనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు జుగుల్ కిషోర్ ఖండేల్‌వాల్ తెలిపారు.