ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూయార్క్ -తె లంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సీనియర్ లీడర్షిప్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఐటీ సర్వీస్ అలయన్స్‌లతో రాష్ట్రంలో పెట్టుబడులపై సమావేశం నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజాలో సీఎంకి సన్మాన కార్యక్రమాన్ని తెలుగువారు నిర్వహించనున్నారు. ఈనెల 3న అమెరికా వెళ్లిన సీఎం అక్కడ పర్యటన ముగించుకుని అనంతరం దక్షణి కొరియా వెళ్లనున్నారు.
నిన్నటి భేటీలు..
వరల్డ్ బ్యాంక్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణకు అమెరికన్ ప్రతినిధులు ఓకే చెప్పారు. వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బయో ఫ్యూయల్స్ సంస్థ స్వచ్ఛ బయో అంగీకారం తెలిపింది. కాగ్నిజెంట్ కంపెనీతోనూ సీఎం నిన్న ఒప్పందం చేసుకున్నారు. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీసీయం హైదరాబాద్‌లో తమ కంపెనీ ఏర్పాటుకు అంగీకరించింది. ఆర్సీసీఎం విస్తరణతో 500మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికాకు హైదరాబాద్‌కు సారూప్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అమెరికా కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు తెలిపారు. తెలంగాణకు వచ్చి చూడాలంటూ ఇన్వెస్టర్లకు ఆయన పిలుపునిచ్చారు. చైనాతో పోటీ పడి తెలంగాణను నంబర్ వన్‍గా నిలుపుతామని రేవంత్ చెప్పారు.