Friday, September 27, 2024

TG: కొండా లక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్, కెటిఆర్ నివాళి ..

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీకి రేవంత్, కెటిఆర్ నివాళి..

హైద‌రాబాద్ – స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. తెలంగాణ కోసం తపించిన బాపూజీ అడుగుజాడల్లో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన సేవలు నిరంతరం గుర్తుండాలన్న లక్ష్యంతోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు రేవంత్. ఈ కార్య‌క్ర‌మంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, మైనంపల్లి రోహిత్, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి లు పూల‌మాల‌లు వేసి నివాళులర్పించారు.

ప్ర‌జా పోరాట యోధుడు కొండా లక్ష్మ‌ణ్ – కెటిఆర్

ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు కెటిఆర్ . 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు.. ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆయన నివాసంలోనే పురుడు పోసుకుందన్నారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ మహనీయుడిని సమున్నతంగా గౌరవించిందని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద వారి విగ్రహం ఏర్పాటు చేసింద‌ని, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టిందని గుర్తుచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement