Friday, November 22, 2024

CM Revanth’s ప్ర‌జావాణికి జ‌నం పోటు – కిలోమీట‌ర్ల మేర క్యూలు..

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్ కు భారీగా తరలివస్తున్నారు. ఈ వారంలో రెండోసారి జరిగే నేటి ప్రజావాణి కోసం ప్రజలు పోటెత్తారు. ఉదయం 5 గంటలకే ప్రజాభవన్‌ ముందు క్యూ కట్టారు. ఈ క్యూ లైను తొమ్మిది గంటలకల్లా కిలోమీటరుకుపైగా పెరిగిపోయింది.

అయితే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలందరూ హైదరాబాద్‌ ప్రజాభవన్‌కే రానవసరం లేకుండా ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల్లోనూ ప్రజావాణి నిర్వహింపజేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.​ ప్రజా వాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుం‍డా ప్రజలకు హైదరాబాద్‌ దాకా వచ్చే భారం తగ్గుతుంది. ప్రజాభవన్‌ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుంది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి, ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాదర్భార్‌ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమం​ పేరును ప్రజావాణిగా పేరుమార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement