హైదరాబాద్ – తొలిసారి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి నెలలో ఆయన స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 15-19 మధ్య దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలతో సీఎం సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే అవకాశాలు, ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగా, ఆ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
ఇది ఇలా ఉంటే , వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వంద దేశాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈసారి ల్యాబ్ నుంచి లైఫ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అనే అంశంతో ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సదస్సులో మన దేశంలోని కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. గత పదేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందింది. చాలా కంపెనీలు నగరంలో కార్యాలయాలు ప్రారంభించి భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానిదే. నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.