తెలంగాణలో గెలుపు గుర్రాలను రంగంలోకి దించే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తులు తుదిదశకు చేరుకొంటున్నాయి. ఇప్పటికే 13 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం మిగిలిన నాలుగు లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది. డిల్లీలో నేడు జరిగే సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఈ మేరకు ఢిల్లీలో జరిగే సీఈసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ నేటి ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. నేడు ఢిల్లీలో జరిగే సమావే శంలో వీరు పాల్గొంటారు. ఈ సీఈసీ సమావేశంలో తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించనున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా నియోజక వర్గాల నేతల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ సేకరించింది.
13 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్…
ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. నేటితో ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో ఓ స్పష్టత రానుంది. దీంతో పాటు, సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్‌ను ఏఐసీసీ ప్రకటించగా, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
వరంగల్ కు కావ్య – హైదరాబాద్ కు సానియా ?…
వరంగల్ నుంచి నిన్న కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్య పేరు ఖరారు కావచ్చు . ఖమ్మం టికెట్ కోసం లోకేశ్ యాదవ్, రాజేంద్ర ప్రసాద్… కరీంనగర్ స్థానంలో ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్… హైదరాబాద్ నుంచి సానియా మీర్జా, షహనాజ్ తుబ్సుం పేర్లు పరిశీలనలో ఉన్నాయి.