కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందని.. ముఖ్యమంత్రి అనే సోయి రేవంత్ రెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్. ఇందిరమ్మ రాజ్యం అంటూ మహిళలను అగౌరవపర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు.
మహాలక్ష్మి పథకం కిందనే మూడు హామీలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 హామీ ఏమైందని క్వశ్చన్ చేశారు. రూ.500 గ్యాస్ సబ్సిడీ 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుందన్నారు. మొత్తం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులున్నాయన్నారు.
గ్యాస్ కనెక్షన్లు కేవలం మహిళల పేరు మీద ఉంటేనే సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్తోందని.. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు మొత్తం కట్టించుకుని సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో వేస్తామని అంటున్నారని, దీనితో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకం బోగస్ పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. మహిళలకు సరిపడా బస్సులను ప్రభుత్వం నడపాలని కోరారు.