Friday, November 22, 2024

Symbol | ఫైన‌ల్ కాలే.. లోగో ప‌రిశీల‌న‌లో ఉంద‌న్న సీఎం రేవంత్‌

జయ జయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అదే వేడుకల్లో జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర గీతంపై సచివాలయంలో గురువారం సాయంత్రం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రులు సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కవి అందెశ్రీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, కాంగ్రెస్‌ మిత్ర పక్ష నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు.

- Advertisement -

జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు.

కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని.. అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కూడా నిర్ణయించామని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement