తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం కేరళ కు వెళ్లనున్నారు. వయనాడ్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ ఎంపీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు.
అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ తో సహా రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసి రెండు చోట్ల అఖండ విజయం సాధించారు. దీంతో ఆయన రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వయనాడ్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే, వయనాడ్ ఉప ఎన్నిక గెలుపును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానానికి కాపాడుకునే విషయంలో ఆ పార్టీ అగ్ర నాయకత్వం అక్కడి నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.