కోస్గి, జులై 5 (ప్రభ న్యూస్): కోస్గి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్, రెండవ వార్డ్ కౌన్సిలర్ గోవర్ధన్ రెడ్డి శుక్రవారం హఠాన్మరణం చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత గోవర్ధన్ రెడ్డి మృతి చెందాడన్న సమాచారంతో హుటాహుటిన కోస్గికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి మధ్యాహ్నం 2గంటలకు కోస్గికి చేరుకున్నారు.
కోస్గి నుండి రోడ్డు మార్గంలో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్న సీఎం గోవర్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. భార్య సావిత్రి, తల్లి యాదమ్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓదార్చి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోస్గి పర్యటన నేపథ్యంలో నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్చార్జి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, రఘువర్దన్ రెడ్డి, బాలరాజు, తదితరులున్నారు.