ఆంధ్రప్రభ స్మార్ట్ : జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలిపారు.
జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికినీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా ఈ పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్), (రూరల్) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయమవుతుందని, ఈ ఏడాది నుంచి జల్‌జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.