ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో, ప్రభ న్యూస్ : మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి కలిశారు. జితేందర్ రెడ్డి బిజేపి పార్లమెంటు సీటు ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను స్వయంగా ఇంటికి వెళ్లి కలిశారు.
మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారు చేశారు. మరోవైపు బిజెపి డీకే అరుణకు అవకాశం కల్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.
2018 ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరిన జితేందర్ రెడ్డి తనకు ఈసారి తప్పనిసరిగా టికెట్ వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తదితరులతో సత్సంబంధాలు ఉన్న కారణంగా తనకు తప్పనిసరిగా టికెట్ వస్తుందని చివరిదాకా ప్రయత్నించారు. కానీ టికెట్ తనకు కాకుండా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు రావడంతో ఆయన తీవ్ర నిరాశ గురయ్యారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయంగా సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అని, వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం జితేందర్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం.