హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం వేదికగా ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ ఈనెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈమేరకు రాష్ట్ర్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు కంటి వెలుగు సంసిద్ధతపై ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈనెల 18న ఖమ్మం నుంచి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న దృష్ట్యా దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని సమన్వయం చేసుకోవాలన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలనీ, పరీక్ష బృందాలకు అవసరమైన సౌకర్యాలను స్థానికంగా కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే మిగతా అన్ని జిల్లాలలో కంటి పరీక్షలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి రెండు మూడు రోజుల ముందే కంటి పరీక్షలు నిర్వహించే యంత్రాలు, కంటి అద్దాలు, మందుల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.