ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుండి సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో గజ్వేల్ ఐఓసీ కార్యాలయం పక్కన గల మైదానం కు చేరుకొని అక్కడి నుండి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసి అనంతరం తిరిగి కామారెడ్డికి వెళ్లి అక్కడ నామినేషన్ వేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. నామినేషన్ పత్రాలను ఆర్డీవో కార్యాలయంలో ఆర్వోకు స్వయంగా కేసీఆర్ అందిస్తారు.అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జన హారతి పట్టేందుకు నిర్ణయించారు. ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. సీఎం బహిరంగ సభపై ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేయగా, కేసీఆర్‌ను స్వయంగా చూసేందుకు, ఆయన చెప్పే విషయాలను ఆలకించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎనిమిది మండలాల నుంచి పెద్దసంఖ్యలో తరలిరానున్న జనం కోసం బీఆర్‌ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈనెల 28న మధ్యాహ్నం రెండు గంటలకు గజ్వేల్ లో నిర్వహించే ఎన్నికల చివరి ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో చివరి సభలు ఇక్కడ నుండే నిర్వహించి గజ్వేల్ విజయంతో పాటు రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది.