ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పర్యావరణ పరిరక్షణ కోసం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను మించిన సంపద లేదనే విషయం ప్రస్తుతం కరోనా సమయంలో మరోసారి రుజువయ్యిందన్నారు. స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకక పరితపిస్తున్న దుర్భర పరిస్థితులను పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే అధిగమించగలమని సీఎం అన్నారు. ఆరోగ్య సంపదను మించిన సంపద లేదనే ఎరుకతోనే తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి కార్యాచరణ చేపట్టిందన్నారు. నాసిరకం ప్లాస్టిక్ వాడకం మీద నియంత్రణను విధిస్తూ గ్రీన్ కవర్ పెంచే హరితహారం వంటి పలు పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ పట్టణాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు పర్యావరణాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయని, జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటున్నాయని గుర్తు చేశారు.
సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, సాగునీరు రాష్ట్రవ్యాప్తంగా పుష్కలంగా లభిస్తున్నదన్నారు. పలు పథకాల ద్వారా పాడి పంటలు, పండ్లు, కూరగాయలు, మాంసాహారం సమృద్ధిగా ఉత్పత్తి జరిగి, పౌష్టికాహారం రాష్ట్ర ప్రజలకు అందుతున్నదన్నదని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, నదీ జలాలను మల్లించడం ద్వారా అడుగడుగునా పచ్చదనం ప్రకృతి పర్యావరణ సమతుల్యతను సాధించామన్నారు. తెలంగాణ ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. జీవ వైవిధ్యంతో కూడిన ఆకుపచ్చని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.