తెలంగాణ సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పరిశీలించారు. వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. తన పర్యటన రోజు ఊరంతా కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పారు. గ్రామ సభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని పేర్కొన్నారు.
వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ నెలలో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించారు. అనంతరం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాసాలమర్రి గ్రామాన్ని అంకాపూర్, ఎర్రవల్లి తరహాలో తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. గ్రామ రూపురేఖలు మార్చేందుకు 50 నుంచి 100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.