Monday, November 25, 2024

TRS Dharna: ఈ యుద్ధం అంతం కాదు.. ఆరంభం మాత్రమే: కేంద్రానికి సీఎం కేసీఆర్ హెచ్చరిక

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తోంది. ఈ మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ యుద్ధం అంతం కాదు, ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఉధృతమై ఉప్పెనలా సాగుతుందన్నారు. గ్రామ గ్రామాన పోరాటం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిరంకుశ చట్టాలను విరమించుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉందన్నారు. కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌న్న సీఎం కేసీఆర్.. క‌రెంటు బ‌కాయిల మీట‌ర్లు పెట్టే విధానాన్ని మార్చుకోవాల‌ని అనేక‌సార్లు చెప్పామని తెలిపారు. కానీ కేంద్రం నుంచి స్పంద‌న లేదని మండిపడ్డారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ యుద్ధం నేటితో ఆగిపోదన్న కేసీఆర్.. ఇది ఆరంభం మాత్ర‌మే. అంతం కాదని స్పష్టం చేశారు. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్ర‌యోజ‌నాలు ప‌రిర‌క్షించ‌బ‌డే వ‌ర‌కు పోరాట‌ల‌ను భ‌విష్య‌త్‌లో ఉధృతం చేస్తామన్నారు.

పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. నిన్న స్వ‌యంగా ప్ర‌ధాని మోదీకి లేఖ రాశానని, కానీ ఉలుకు ప‌లుకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాల‌ను చేస్తామన్నారు. కేంద్రం దిగివ‌చ్చి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతూనే ఉందని, ఈ ఉద్య‌మాన్ని ఉప్పెనలా కొన‌సాగిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రివర్గం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి బాధ్యులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement