రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ దూకుడు పెంచింది. నేరుగా అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రంగంలోకి దిగి వరుసగా ప్రజాఆశీర్వద సభలో పాల్గొంటూ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడుచోట్ల ప్రజా ఆశీర్వద సభలో పాల్గొంటారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుందని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.ఒక రోజు గ్యాప్ తర్వాత.. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
ఉమ్మడి నల్గొండలో కనివిని ఎరుగని రీతిలో సభలు నిర్వహించేందుకు సర్వత్రా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నియోజకవర్గాల్లోని ఆయా మండలాలు సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గులాబీమయమయ్యాయి. అడుగుడుగునా గులాబి దళపతి కౌటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు సభకు భారీగా తరలి వచ్చేలా గ్రామాల్లో ముమ్మర ప్రచారం సాగింది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు కోదాడ చేరుకొని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో, తరువాత ఆలేరులో పర్యటించి ప్రసంగిస్తారు. ఆలేరు సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.