గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సంగారెడ్డిజిల్లాలోని నారాయణఖేడ్‌లో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈసందర్భంగా సీఎం సభ కోసం భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నాం 2గంటలకు సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వద సభకు రానున్నారు. సభ కోసం కరస్‌గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుండగా, సభాస్థలి సమీపంలోనే హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
50 వేల మంది జన సమీకరణే లక్ష్యంగా సభ నిర్వహిస్తుండగా, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలో మొత్తం ఆరు ప్రదేశాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయించగా మన్సూర్పూర్ చౌరస్తా, నాగల్గిద్ద రోడ్డు వద్ద, మనూరు రోడ్డు వద్ద, పంచగామ కమాన్ వద్ద, సేవాలాల్ చౌక్ వద్ద పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేయగా, వీఐపీల కోసం సభాస్థలికి సమీపంలో వాగ్దేవి జూనీయర్ కళాశాల వద్ద వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. 450 మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సభాస్థలి వద్ద ప్రత్యేక భద్రత చేశారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వచ్చినా తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ ఇక్కడి రావడం ఇదే మొదటి సారి కావడంతో సీఎం ప్రసంగం పై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఎలాంటి అవాక్కులు, చావక్కులు పేల్చుతారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.