ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 19: కేసీఆర్ ఒక మహాత్ముడు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ, త్రీవీలర్ స్కూటర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లక్ష రూపాయల చెక్కుల పంపిణీ, చదువుకున్న దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటర్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశంలో ఎవరికీ రాని ఆలోచన కేసీఆర్ చేశారన్నారు. ఇన్నేళ్ల స్వాతంత్ర్య దేశంలో మైనార్టీలను ఓట్లను ఉపయోగించుకున్న రాజకీయ పార్టీలను చూశాం.. కానీ వారి సంక్షేమం గురించి ఎవరూ ఆలోచన చేయలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు.
మైనార్టీల సంక్షేమానికి ఉచితంగా లక్ష రూపాయలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. జిల్లాలో మొదటి విడతగా మైనార్టీలకు 497 మందికి లక్ష రూపాయల చెక్కులను, దివ్యాంగులకు 17మందికి త్రీవీలర్ స్కూటర్స్, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్, శామీర్ పేట జెడ్పీటీసీ అనిత, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా మహిళా శిశు, వికలాంగ, వృద్ధుల అభివృద్ధి శాఖ అధికారి కృష్ణా రెడ్డి, జిల్లా మైనార్టీల అభివృద్ధి శాఖ అధికారి మహమ్మద్ ఖాసీం, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.