Saturday, November 23, 2024

సాగునీటి విడుదలకు సీఎం కేసీఆర్‌ అనుమతి.. ఈసారి 40లక్షల ఎకరాలకు నీళ్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ నీటి సంవత్సరం 2022-23 ఏడాదిలో రాష్ట్రస్థాయిలో సాగునీటి ప్రణాళిక ఖరారు కావడంతో… జిల్లాల వారీగా వేగంగా ప్రణాళికలు ఖరారవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇవ్వడంతో… ఆయా జిల్లాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, నీటి లభ్యత, ఆయకట్టు వానాకాలం, యాసంగి అవసరాలు, మిషన్‌ భగీరథ కింద తాగునీటి అవసరాలు తదితర అంశాల ఆధారంగా సాగునీటి ప్రణాళికను ఖరారు చేస్తున్నారు. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులన్నీ నిండడంతో ఈ ఏడాది ప్రాజెక్టులు, చెరువుల పరిధిలోని ఆయకట్టుకు 70శాతం సాగునీటి లభ్యత ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న భారీ, మధ్య, చిన్న తరహా నీటి పారుదల వ్యవస్థలతోపాటు చెరువులు తదితర వనరుల కింద సాగు అయ్యే భూమి లెక్కలు తేలుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గోదావరి నదిపైన ఉన్న శ్రీరాంసాగర్‌, ఇచ్చంపల్లి ప్రాజెక్టులతోపాటు కృష్ణా నదిపైన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌ తదితర ప్రాజెక్టుల్లో నీటి మట్టం ప్రస్తుతం సాధారణ నీటిమట్టం కంటే తక్కువగానే ఉన్నాయి.

వానాకాలంలో వర్షాలు భారీగా కురిస్తే ఒకటి, రెండు వర్షాలకే జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టుల కింద ఇప్పటికీ నీటి పంపిణీ కాలువలు అసంపూర్తిగా ఉండడంతో ఆశించినస్తాయిలో ఆయకట్టుకు సాగునీటి అవసరాలు తీర్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది 6.10లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంటుందని నీటిపారుదలశాఖ తేల్చింది. అదేవిధంగా… నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఈ వానాకాలంలో మొత్తం 1.30లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద వానాకాలం సాగు కోసం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం నీటిని విడుదల చేశారు. కాగా… ఈ ఏడాది వానాకాలం సాగుకు భారీ, మధ్యతరహా , మైనరల్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కింద మొత్తం 40లక్షల ఎకరాల కు సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం అంశాలపై క్షేత్రస్థాయి ఇంజనీర్లతో ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ చర్చించారు. ఎస్సారెస్పీ ఎగువ ఆయకట్టు 4,62,920 ఎకరాలకు, దిగువన 7,75,899 ఎకరాల ఆయకట్టుకు , నాగార్జునసాగర్‌ పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement