Friday, November 22, 2024

దళిత బంధు ఆగేది లేదు.. ఈసీపై కేసీఆర్ ఫైర్

కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్లీన‌రీలో సీఎం కేసీఆర్ అధ్య‌క్షోప‌న్యాసం చేశారు. ఈ సందర్భంగా ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ స‌భ పెట్టొద్దు అని చెప్పడం ఇది ఒక ప‌ద్ధ‌తా? అని ప్రశ్నించారు. కొంద‌రు దిక్కుమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగ‌ర్ స‌భ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారన్న సీఎం కేసీఆర్.. హుజూరాబాద్‌లో స‌భ నిర్వ‌హించొద్దంటూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులు అని పేర్కొన్నారు. ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతుందని స్పష్టం చేశారు. న‌వంబ‌ర్ 4 వ‌న‌ర‌కు ద‌ళిత బంధు అమ‌లును ఆప‌గ‌లరని చెప్పారు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడన్న కేసీఆర్… హుజూరాబాద్ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ అభ్యర్థిని దీవించి, ఆశీర్వ‌దిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర‌మంత‌టా ద‌ళిత బంధును అమ‌లు చేస్తాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళిత బంధుతోనే ఆగిపోం అన్న కేసీఆర్.. ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌న్నారు. అట్ట‌డుగున ఉన్నందునే ద‌ళితుల‌కు మొద‌ట కార్య‌క్ర‌మం చేప‌ట్టామని తెలిపారు. ద‌ళిత‌బంధుపై పెట్టే పెట్టుబ‌డి వృథా కాదని, ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పాటునిస్తోందని సీఎం కేసీఆర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: దళిత బంధుపై తీర్పు రిజర్వ్

Advertisement

తాజా వార్తలు

Advertisement