Friday, November 22, 2024

తెలంగాణ మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు.. కేబినెట్ సబ్ కమిటీలో వారికి చోటు!

తెలంగాణలో కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్​లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కేబినెట్​ నిర్ణయం తీసుకొంది. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకై కేబినెట్ సబ్ కమిటీ నియామకం జరిగింది. ఈ సబ్ కమిటిలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్ గా, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా వ్యవహరిస్తారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు, అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా ఈ సబ్ కమిటీ పనిచేస్తుంది.

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించింది. ఒకవేళ చిన్న పిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 133 కోట్ల ఖర్చుతో 5200 బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యానికి ముందస్తుగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు.

గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే వుండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది. కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కేబినెట్ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని కేబినెట్ ఆదేశించింది.

- Advertisement -

ఇది కూడా చదవండి: పోలీసులే నా భర్తను చంపారు: నిందితుడు రాజు భార్య సంచలన ఆరోపణ

Advertisement

తాజా వార్తలు

Advertisement