హైెదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ప్రభుత్వం బంపరాఫర్ ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్‌పీఎస్సీ )తో పాటు పోలీసు నియామక సంస్థ, సింగరేణి, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపికయ్యే వారికి కొత్త పేస్కేళ్లను అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖకు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా అధికార వర్గాలు చెబతున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆయా నియామక సంస్థలు దశల వారీగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఎంపిక పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నియామక సంస్థలు కొత్త పేస్కేళ్లను అమలు చేసే విషయాన్ని ముందు స్పష్టం చేయాలని ప్రభుత్వం కోరినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ఐదారు నోటిఫికేషన్లను జారీ చేయగా పోలీసు నియామక సంస్థ కానిస్టేబుల్ అధికారి, ఇతర ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షన నిర్వహించింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది.
ఉద్యోగంలో చేరిన రోజు నుంచే కొత్త పేస్కేళ్లను అమలు చేసేలా వారికి నియామక పత్రంలో సూచించాలని ప్రభుత్వం కోరింది. పాత పేస్కేళ్ల స్థానంలో కొత్త స్కేళ్లను అమలు చేయడంతో పాటు ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఏడాది పాటు ప్రొబేషన్‌లో పని చేయాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటికే 17 వేల ఖాళీల భర్తీకి పోలీసు నియామక సంస్థ నోటిఫికేషన్ ఇవ్వగా, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను నింపేందుకు ప్రకటనలు జారీ చేసింది. ప్రభుత్వం మరోసారి వేతన సవరణ చేసేంత వరకు ఈ పేస్కేళ్లే అమలవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగులకే అధికంగా జీతాలు లభ్యమవుతున్నాయని సమాచారం. ఇంక్రిమెంట్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ప్రయోజనం చేకూరుతుందని అధికార లెక్కలను బట్టి తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, ఆయా ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసేవారికి కూడా తెలంగాణ ఉద్యోగుల తరహాలు జీతభత్యాలు అందడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా జీతాలు పెరిగాయని, ఇందుకు తగినట్టు దశల వారీగా భత్యాలు, ఇంక్రిమెంట్లు పెరుగుతూ వస్తున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఆఫీస్ సబార్డినెట్ జీతం రూ. 23 వేలు..
ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినెట్ జీతం ఏకంగా రూ. 19 వేల నుంచి రూ. 23 వేలకు పెరిగిందని కొత్తగా ఈ ఉద్యోగంలో చేరే వారికి తొలి నెల జీతం ఇంతే మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో వీరి జీతం రూ. 19 వేలు మాత్రమే ఉండేదని 2015లో సీఎం కేసీఆర్ 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడంతో జీతం అమాంతం రూ. 23 వేలక చేరిందని అధికారాలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సబార్డినెట్ ఉద్యోగికి రూ. 18 వేలు మాత్రమే వస్తోందని, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదానికంటే కేంద్రం రూ. 4 వేలు తక్కువగా చెల్లిస్తోందని చెబుతున్నారు. ఇత రాష్ట్రాల్లో కూడా ఆఫీసు సబార్డినెట్ జీతం రూ. 15 వేలకు మించిలేదని గణాంకాలు చెబుతున్నాయి.
ఎస్‌ఐ కొత్త పేస్కేలు రూ. 42,300- రూ. 1,15,270
కొత్తగా సబ్‌ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరిన అధికారికి పాత స్కేలు రూ. 28,940- రూ. 78,910 ఉండగా పెంచిన పేస్కేలు ప్రకారం రూ. 42,300- రూ. 1,15,270 గా ఉంది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, గ్రేడ్- 2 పాత స్కేలు రూ. 40,270 ఉండగా కొత్త పేస్కేలు ప్రకారం రూ. 58, 850- రూ. 1,37,050 గా నిర్ణయించారు. ఇలా రిజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, ఎంపీడీవో , అసిస్టంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మహిళా శిశు సంక్షేమ అధికారిగా చేరిన వారికి వారి హోదాను బట్టి కొత్త పేస్కేళ్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా పోలీస్ కానిస్టేబుల్ అధికారిగా చేరిన వారికి కనీస వేతనం రూ. 70 వేలకు పైగానే వచ్చ అవకాశం ఉంది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సడలించిన పేస్కేళ్లను అమలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై కొట్లాది రూపాయల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఐతే కొత్త నోటిఫికేషన్లు ద్వారా ఆయా ఉద్యోగాల్లో చేరేవారికి పెన్షన్ సదుపాయం లేకపోవడంతో కొంత ఊరట కలుగుతుందని లేని పక్షంలో పదవీ విరమణ చేసిన వారికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.