ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరాభివృద్దికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, అందులో భాగంగా బుధవారం నగరానికి రానున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. కేసీఆర్ దిక్షా దీవస్ సంధర్భంగా వరంగల్ నగర పరిధిలోని దేవన్నపేట శివారులో విజయగర్జన సభను నిర్వహించేందుకు టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈనెల 29న సుమారు 10 నుండి 12 లక్షల మందిని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా దేవన్నపేట శివారులో స్థలాన్ని సేకరించి పనులను ప్రారంభించారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అద్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, మాజీ డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పనులను పరిశీలించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సభ కోసం 300 ఎకరాలకు పైగా, పార్కింగ్ కోసం బహిరంగ సభ ప్రాంగణం చుట్టూ సుమారు 1500 ఎకరాల స్థలాన్ని సేకరించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పార్టీని స్థాపించి 20వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పార్టీ సాధించిన విజయాలు, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శవంతమైన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. వరంగల్ నగరంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, టెక్ట్స్ టైల్ పార్క్, నగరంలోని రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణాలు తదితర అభివృద్ది పనులను సమీక్షించి, అవసరమైన ఆదేశాలు జారీ చేస్తారని మంత్రి దయాకర్‌రావు తెలిపారు.